🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 09 Oct, 2026 | Page: 1

కొంపల్లిలో సొంత ఖర్చులతో బతుకమ్మకు బంగారు బాట..!

కట్ట రహదారికి మరమ్మతులు.. పారిశుద్ధ్య పనులు
మహిళలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ చొరవ
మెదక్‌, అక్టోబర్‌ 10, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొంపల్లి గ్రామ సర్పంచ్‌ జూకంటి పాపయ్య, ఉపసర్పంచ్‌ దయ్యం శెట్టయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కొంపల్లి గ్రామంలోని చెరువు కట్ట రహదారి అస్తవ్యస్తంగా ఉండటంతో, తమ సొంత ఖర్చులతో మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
బతుకమ్మ వేడుకలకు మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో చెరువు కట్టపై ఉన్న అడ్డంకులను తొలగించి, రహదారిపై మొరం వేయించి రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దే పనులు చేపట్టారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు ఆటపాటలతో పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రహదారిని శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజల రాకపోకలు సాఫీగా సాగాలనే ఉద్దేశంతో ఈ పనులకు ముందుకొచ్చినట్లు వివరించారు.
🏠 Home