🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 19 Oct, 2026 | Page: 1

చేర్యాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.!

వరకు సాగిన ఆడపడుచుల ఆటపాటలు!
​రంగురంగుల పూల బతుకమ్మలతో వెల్లివిరిసిన పండుగ శోభ.. మహిళల ఐక్యతకు ప్రతీక
​ ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ అభిలాష్, ఎస్సై అపూర్వ రెడ్డి
​ప్రశాంత వాతావరణంలో ముగిసిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మహోత్సవం
అక్కడక్కడ విద్యుత్ దీపాల కొరతపై ప్రజల్లో కొంత అసంతృప్తి..!
​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన జీవన సంస్కృతికి అద్దంపట్టే ఈ ఉత్సవాల్లో మహిళలు, యువతులు సరికొత్త ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ప్రధాన కూడళ్లలో ప్రతిష్టించి, అర్ధరాత్రి 12 గంటల వరకు సామూహికంగా చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా సందడి చేశారు. పూలను ఆరాధిస్తూ మహిళలంతా ఒక్కచోట చేరి జరుపుకున్న ఈ వేడుకలు స్థానికంగా ఆత్మీయతను, ఐక్యతను చాటిచెప్పాయి.పట్టణం లో అక్కడక్కడా విద్యుత్ దీపాల కొరత నెలకొనడంతో ప్రజల్లో కొంత నిరాశను, అసంతృప్తిని కలిగించింది.
​వేడుకలకు హాజరైన మహిళలకు, ప్రజలకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేర్యాల మున్సిపల్ కమిషనర్ అభిలాష్, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు మౌలిక వసతులు కల్పించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం పకడ్బందీ బందోబస్తు నిర్వహించింది. మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో వేడుకలు ప్రశాంత వాతావరణంలో దిగ్విజయంగా ముగిశాయి.
​– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰
🏠 Home