🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 29 Oct, 2026 | Page: 1

నీటి సంరక్షణతోనే కరువును ఎదుర్కోగలం : సర్పంచ్ కనక చంద్రం

గాగిల్లాపూర్‌లో సాంస్కృతిక సారథి కళాబృందం అవగాహన కార్యక్రమం
మద్దూరు, అక్టోబర్ 29, హిందుస్థాన్ మీడియా: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ప్రజలు నీటి వనరులను సంరక్షించుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు సూచించారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి బిజ్జురి రవికుమార్‌, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆదేశాల మేరకు గురువారం మద్దూరు మండలం గాగిల్లాపూర్‌లో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా నీటి సంరక్షణ, కరువు నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్‌ ఇట్టబోయిన కనకచంద్రం మాట్లాడుతూ, భూగర్భ జలాలు అడుగంటకుండా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు వ్యవసాయ పొలాల్లో పంట కుంటలు, నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వేసవిలో పశువులకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే పశుగ్రాసాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమష్టిగా కృషి చేయాలని సర్పంచ్‌ పిలుపునిచ్చారు.
🏠 Home