EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేజీబీవీలో సమస్యలకు చెక్ -15 రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు :ఎమ్మెల్యే పల్లా

    Author R K SRINIVAS | 28 Aug 2026, 08:18 AM | TELANGANA
    కేజీబీవీలో సమస్యలకు చెక్ -15 రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు :ఎమ్మెల్యే పల్లా

    డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం

    భోజనం, వసతి, ఆరోగ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
    సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, మద్దూరు: ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, వసతులు, భోజన నాణ్యత, ఇతర సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు.

    విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యార్థినులతో నేరుగా మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఏయే గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు? ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థినులు ఉన్నారు? ఉపాధ్యాయుల బోధన ఎలా ఉంది? పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
    ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ ఘటనకు గురైన విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన రోజునే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనలో 21 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చేరినట్లు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు వివరించారు.

    డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం
    పాఠశాలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక సర్పంచ్ సమన్వయంతో డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన జేసీబీ ఖర్చులను తానే భరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

    15 రోజుల్లో సోలార్ ఫెన్సింగ్
    పాఠశాల ఆవరణలో కోతుల బెడద కూడా ఉందని విద్యార్థినులు ఎమ్మెల్యేకు తెలిపారు. దీనిపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి 15 రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు కోతుల బెడద లేకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
    భోజనం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
    విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలపై ఎమ్మెల్యే ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డైనింగ్ హాల్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థినులు ఇంట్లో భోజనం చేస్తున్న అనుభూతి కలిగేలా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
    విద్యార్థినుల భోజనం, వసతి, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పాఠశాలకు అవసరమైన అదనపు వసతులు, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
    స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాల వద్దే ఉండి అవసరమైన పనులను పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం, మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మ్యాక సంతోష్ కుమార్, నాయకులు కంఠారెడ్డి మధుసూదన్ రెడ్డి, బోయిని పవన్ తదితరులు పాల్గొన్నారు.