EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

    Author THADEM PRASHANTH | 29 Oct 2026, 04:06 PM | TELANGANA
    రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

    రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్‌ పథకం భరోసా
    జిల్లాలోని 7 ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం
    రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్‌ (PM RAHAT) పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సూచించారు. ఈ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు ఆసుపత్రుల్లో అర్హత నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు, ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని తెలిపారు.
    రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య సహాయం అందేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేయకుండా, అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్‌ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
    ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్‌ పెట్టుకోవాలని ఎస్పీ సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.

    పథకం వర్తించే ఆసుపత్రులు:

    1. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌), సిరిసిల్ల
    2. సిరి ఆసుపత్రి, సిరిసిల్ల
    3. అశ్విని ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట
    4. సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), ఎల్లారెడ్డిపేట
    5. సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), గంభీరావుపేట
    6. ఏరియా ఆసుపత్రి, వేములవాడ
    7. బీసీఎం కంటి ఆసుపత్రి, కొదురుపాక